నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు.
పండుగ సందర్భంగా ఉదయం నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈద్గాహ్లకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని అల్లాహ్ను ప్రార్థించారు.
ప్రార్థనల అనంతరం సంప్రదాయం ప్రకారం మేకలు, గొర్రెలను ఖుర్బానీ చేసి వాటి మాంసాన్ని బీదలకు, బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. చిన్నారులు కొత్త దుస్తుల్లో సందడి చేయగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లింలు కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు.
జామే మస్జీద్ ఇమామ్ ఈద్గాహ్లో ప్రసంగిస్తూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని తెలిపారు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవాభావం, మానవత్వం, ప్రేమాభిమానాలను పెంపొందించుకోవాలని సూచించారు.
అలాగే గోవు ఖుర్బానీ చేయవద్దని, పరస్పర మత భావాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై వ్యర్థాలు పడవేయకుండా పరిశుభ్రత పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.












