కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలు అవుతుండటంతో ఈ ప్రాంతం దక్షిణ భారతదేశపు సరికొత్త ఆర్థిక కేంద్రంగా మారేందుకు సిద్ధమవుతోంది.
ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ మెగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 23, 2026న శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్ట్ లక్షలాది మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి అనుబంధంగా ఏర్పాటు కానున్న సొంత ఓడరేవు ప్రాంత వాణిజ్యానికి ఊతం ఇస్తుంది.
విశాఖపట్నం ఐటీ రంగంలో గణనీయమైన అభివృద్ధికి గూగుల్ ఏఐ హబ్ దోహదపడనుంది. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏప్రిల్ 2026లో శంకుస్థాపన జరగనున్న ఈ ప్రాజెక్ట్, విశాఖను ప్రపంచ స్థాయి డిజిటల్ గేట్వేగా మార్చడంతో పాటు, 1.88 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేస్తుంది.
ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో భారీ పెట్టుబడులతో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అదానీ గ్రూప్ డేటా సెంటర్లు, అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ వంటివి మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల సమ్మేళనంగా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దుతున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఐటీ ఉద్యోగాల సాధనలో విశాఖ కీలక పాత్ర పోషించనుంది.
రవాణా రంగంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మూలపేట పోర్టు, విశాఖపట్నం పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే, విశాఖకు ప్రపంచ స్థాయి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడటంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.










