తెలంగాణ రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగారపల్లిలో కేజేఎస్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్–II కు వారు శంకుస్థాపన చేశారు.
రూ.650 కోట్ల పెట్టుబడితో, 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితం కానున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 1500, పరోక్షంగా సుమారు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న ఆహార ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోందని, జహీరాబాద్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని నిమ్జ్ (NIMZ)ను అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికలున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచే పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేజేఎస్ ఇండియా యాజమాన్యాన్ని అభినందించారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందేందుకు మరిన్ని పరిశ్రమలు రావాలని ఆయన ఆకాంక్షించారు.












