దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఎల్పీజీ పేరుతో వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. గ్యాస్ కొరతను సాకుగా చూపుతూ అదనపు సేవల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎల్పీజీ గ్యాస్ కొరత పేరుతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీసీపీఏ తెలిపింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు అందాయని, మీడియాలో కూడా వార్తలు ప్రచురితమయ్యాయని పేర్కొంది.
వినియోగదారుల హక్కులను పరిరక్షించే దిశగా ఈ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. మెనూలో స్పష్టంగా పేర్కొన్న ధరలనే వసూలు చేయాలని, అంతకుమించి ఎలాంటి అదనపు ఛార్జీలను విధించరాదని అధికారులు ఆదేశించారు.
ఈ నిబంధనలను పాటించని వ్యాపార సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీసీపీఏ సిద్ధంగా ఉంది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, తక్షణమే స్పందిస్తామని అథారిటీ తెలియజేసింది.











