డిజిటల్ పరివర్తనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ 2026’లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రపంచం వేగంగా డిజిటల్ వైపు మళ్లుతోందని, ఈ మార్పులను అందిపుచ్చుకున్న దేశాలకే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందుందని, తెలంగాణ ఈ ప్రగతికి చోదక శక్తిగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్‌లను అనుసంధానించే ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) కేవలం ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కే పరిమితం కాకుండా, స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వైజర్లుగా, సైబర్ అష్యూరెన్స్ నిపుణులుగా ఎదగాలని మంత్రి సూచించారు. ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలు కొత్త అవకాశాలతో పాటు సైబర్ మోసాలు వంటి సవాళ్లను కూడా తెస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా సీఏలు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు.











