సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం మర్చిపోలేనిదని ఇటీవల బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆమెకు వీడ్కోలు సన్మానం, నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు స్వాగతం కార్యక్రమం నిర్వహించారు.
రహదారులు, భవనాల ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయిన ప్రావీణ్యకు అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో పనిచేసిన కాలంలో కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు అందరి సంపూర్ణ సహకారం అందిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో అందరి సహకారం కీలకమని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్‌గా రావడం సంతోషకరమని, ఆయన నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు నూతన కలెక్టర్‌కు ఇదే సమన్వయంతో సహకరించాలని సూచించారు.
నూతన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రావీణ్య జిల్లా కలెక్టర్‌గా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రావీణ్యతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆమె సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు.











