తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 45,11,947 మంది రైతులకు రూ. 2,206 కోట్లు అందజేయనున్నారు.
రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే తొలి విడతగా రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి రెండు విడతల్లో రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో ఎకరా, అంతకంటే తక్కువ భూమి కలిగిన రైతులకు నిధులు జమ అయ్యాయి.
మూడో విడత చెల్లింపులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే, మూడో విడతలో ఎంత భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏటా రూ.18 వేల కోట్లు అవసరమయ్యే ఈ పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేస్తోంది.
రైతు భరోసా నిధులు జమ కాని రైతులు సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి, తమ అర్హత వివరాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అధికారులు తెలిపారు.







