కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఏండ్రియల్ గ్రామంలోని లబ్ధిదారురాలు పడమటి కౌసల్య ఇంటి నిర్మాణాన్ని సందర్శించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని తెలిపారు.
లబ్ధిదారురాలు పడమటి కౌసల్య గతంలో నివాస పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో సొంత ఇంటి కల నెరవేరుతోందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, గ్రామాల్లో గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లలో నివసించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో PD హౌసింగ్ విజయపాల్, సంబంధిత అధికారులు, MRO, గ్రామ సర్పంచ్, స్థానికులు పాల్గొన్నారు.












