భారత సైన్యంలో 31 సంవత్సరాల పాటు సుబేదార్ మేజర్ – హానరరీ లెఫ్టినెంట్ హోదాతో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన దోవా వీరశేఖర రావును పటాన్చెరు అంబేద్కర్ కాలనీలో ఘనంగా సన్మానించారు.
మంగళవారం బీజేపీ జిల్లా నాయకుడు, టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వీరశేఖర రావును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. భారత సైన్యంలో సిపాయిగా చేరి, అంకితభావంతో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వీరశేఖర రావు యువతకు స్ఫూర్తిగా నిలిచారని బైండ్ల కుమార్ అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వీరశేఖర రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తు జీవితంలో సంతోషం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను అభినందించారు.

