ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భక్తుల జయజయధ్వానాల మధ్య ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నీలం మధు ముదిరాజ్ - కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకను లోక కళ్యాణార్థం నిర్వహించారు.
శుక్రవారం జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో ఫసల్వాది జ్యోతిర్వస్తు పీఠం మహేశ్వర సిద్ధాంతి శర్మ, భూపతి స్వామి ఆశీస్సులతో, సిరిసిల్ల బీటుకూరి నవీన్ ఆచార్య పర్యవేక్షణలో వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సత్సంకల్పంతో నిర్వహించిన ఈ వేడుకకు భక్తజనం పోటెత్తింది. కళ్యాణ మహోత్సవం కోసం భారీ వేదికను తీర్చిదిద్దారు. సిరిసిల్ల నుండి విచ్చేసిన పండిత బృందం శాస్త్రోక్తంగా క్రతువును నిర్వహించారు.
ఉదయం నుండే మంగళ వాయిద్యాలు, వేద పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీనివాసుడు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించి వేదికపైకి తీసుకురావడంతో భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. నీలం కవిత నీలం మధు దంపతులు సంప్రదాయబద్ధంగా పీఠంపై కూర్చుని కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన వేడుకలో పుణ్యాహవాచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ వంటి ఘట్టాలను అర్చకులు పూర్తి చేశారు.
అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు కంకణధారణ గావించి, ప్రవరను చదివి వినిపించారు. జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి భక్తుల హర్షధ్వానాల మధ్య ఆధ్యాత్మిక ఉద్వేగం నెలకొంది. లోక రక్షకుడైన శ్రీనివాసుడు అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ గావించిన ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. నీలం కవిత మధు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలపై శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఈ కళ్యాణాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న తమకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మానసిక తృప్తిని ఇచ్చిందని, ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తామని పునరుద్ఘాటించారు. చిట్కుల్తో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం, లడ్డు ప్రసాద పంపిణీ జరిగింది.












