కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం రథోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.
పావన తుంగభద్రా నది తీరాన కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో, గురువారం ఉదయం నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వామివారి మూల బృందావనానికి పంచామృత అభిషేకం, మూలరాముడికి విశిష్ట పూజలు నిర్వహించారు.
సాయంత్రం వేళ, శ్రీ మఠం ప్రాంగణంలో శ్రీ ప్రహల్లాదరాయ విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం, చెక్క, బంగారం, రజత, అంబారీ, నవరత్నాలతో నిర్మించిన రథాలపై ఉత్సవ మూర్తిని ఊరేగించారు. ఈ రథోత్సవం కన్నుల పండువగా సాగింది.
అర్చకుల మంత్రోచ్ఛారణలు, భక్తుల రాఘవేంద్ర నామస్మరణల నడుమ, అలంకరించిన ప్రహ్లాదుడి విగ్రహాన్ని ప్రాకారం చుట్టూ ఊరేగించారు. భక్తులు పువ్వులు చల్లుతూ స్వామివారికి నీరాజనాలు పలికారు.
రథోత్సవం అనంతరం, డోలోత్సవ మంటపంలో ప్రహ్లాదుడికి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం మూల బృందావనానికి మహా మంగళ హారతులు సమర్పించి, కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఐ.పి. నరసింహమూర్తి, వ్యాసరాజస్వామి అనంతపురం పాల్గొన్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీసులు బందోబస్తు కల్పించారు.







