కామారెడ్డి, జూన్ 30
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నారు. కామారెడ్డిలో జరిగిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించి, అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులపై పెట్టుబడి భారం తగ్గించి, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభం కావడం రైతాంగానికి శుభపరిణామమని పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడం వల్ల పారదర్శకతతో పాటు సకాలంలో పెట్టుబడి అందుతుందని కలెక్టర్ చెప్పారు. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచే నిధులు జమ అవుతాయని, మిగిలిన అర్హులైన రైతులకు వచ్చే తొమ్మిది రోజుల్లో దశలవారీగా నిధులు జమ చేస్తామని తెలిపారు.
జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్లో 10,851 మంది రైతులకు రూ.9,35,33,533 రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. అలాగే 2025–26 యాసంగి సీజన్లో 10,950 మంది రైతులకు రూ.7,34,81,576 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. మొత్తం రెండు సీజన్లలో కలిపి రూ.16.70 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణ, నిధుల జమ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్లు రవితేజ, ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, రామారెడ్డి ఉపసర్పంచ్ నవీన్, ఎంఈవో, ఏడీఏ సుధా మాధూరి, సర్పంచ్ ప్రవీణ్, డీఏవో మోహన్, తహసీల్దార్ ఉమాలత, ఎంఏవో భానుశ్రీ, రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












