రైతులకు యూరియా ఎరువుల పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రైతులకు సూచించారు. మంగళవారం పోతాయిపల్లి గ్రామంలో జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ సూచన చేశారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యూరియా పంపిణీలో పారదర్శకత, సమర్థత, సౌలభ్యం పెంచేందుకు ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ద్వారా రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఎరువుల కేంద్రాల వద్ద రద్దీ తగ్గుతుందని, రైతులు నిర్ణీత సమయంలో యూరియాను సులభంగా పొందవచ్చని వివరించారు.
మొబైల్ యాప్ వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, స్లాట్ బుకింగ్ ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు యాప్ వినియోగంలో ఎదుర్కొనే సమస్యలను అధికారులు పరిష్కరించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పంటల దిగుబడులు పెంచుకోవచ్చని కలెక్టర్ అన్నారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎంఎస్వో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, విద్యుత్ శాఖ అధికారులు, ఎంఈవోతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












