తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “రైతు వారము” కార్యక్రమం శామీర్‌పేట్ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ (ఎఫ్ఎస్సీఎస్)లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు సమూహాలుగా ఏర్పడి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీఓలు)ను బలోపేతం చేసుకోవాలని సహకార శాఖ స్పెషల్ కమిషనర్ రాహుల్ రాజ్ ఐఏఎస్ సూచించారు.
శామీర్‌పేట్ ఎఫ్ఎస్సీఎస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఎఫ్పీఓల ద్వారా రైతులు మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంతో పాటు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందవచ్చని తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు రైతుల్లో చైతన్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా పలు కీలక అంశాలపై చర్చించారు. బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాల సదుపాయం, వరి ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నానో ఎరువుల వినియోగం వంటి ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయంలో డిజిటల్ మార్కెటింగ్ విధానాల అమలు, సహకార క్లబ్‌ల ద్వారా యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
రైతులు–శాస్త్రవేత్తల మధ్య ముఖాముఖి గోష్టి నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సురేఖా రాణి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ఆర్. మధుకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సొసైటీ డైరెక్టర్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.











