కామారెడ్డి జిల్లాలో అయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందుతున్నారని, దీనిపై మరింత మంది రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. తాడ్వాయ్ మండలం ఏండ్రియల్ గ్రామంలోని అయిల్ ఫామ్ తోటను ఆయన బుధవారం సందర్శించి, రైతు బొక్క హన్మాండ్లు సాగు విధానాలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయ్ మండలం ఏండ్రియల్ గ్రామ శివారులో రైతు బొక్క హన్మాండ్లు మూడున్నర ఎకరాలలో సాగు చేస్తున్న అయిల్ ఫామ్ తోటను సందర్శించారు. మొక్కల పెరుగుదల, నిర్వహణ, సాగు పద్ధతులను ఆయన పరిశీలించి, పంట అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రైతు బొక్క హన్మాండ్లు మాట్లాడుతూ, 2022లో అయిల్ ఫామ్ సాగు ప్రారంభించినట్లు తెలిపారు. అయిల్ ఫామ్‌తో పాటు అంతర్ పంటలుగా కూరగాయలు, సోయా, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగు చేస్తూ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల ఆదాయం పొందుతున్నట్లు వివరించారు.
ఉద్యానవన శాఖ ద్వారా అయిల్ ఫామ్ సాగుకు గత నాలుగు సంవత్సరాలుగా ఎకరానికి రూ.4,200 సబ్సిడీతో పాటు డ్రిప్ పరికరాలు కూడా మంజూరు చేశారని రైతు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో సాగు ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం అయిల్ ఫామ్ పంట టన్నుకు సుమారు రూ.23,000 ధర పలుకుతోందని, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. ఇది రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు, అంతర్ పంటల సాగు ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చని కలెక్టర్ సూచించారు.












