సంగారెడ్డి, జూలై 24
ఎల్నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఆగస్టు నెలాఖరులోగా అందించాలని అధికారులను ఆదేశించారు.
ఎల్నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఏకరూప దుస్తులను కుట్టించి ఆగస్టు నెలాఖరులోగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఏకరూప దుస్తుల పంపిణీ, ఎల్నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, ఖరీఫ్ పంటల సాగు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను ఆగస్టు నెలాఖరులోగా అందజేయాలని సూచించారు. అలాగే ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మండలాల వారీగా విత్తన మేళాలను నిర్వహించి రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫాంల కుట్టింపునకు అవసరమైన వస్త్రాలు, ఇతర సామగ్రిని సకాలంలో అందజేయాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకరూప దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.












