కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో శనివారం పిండి గిర్ని వద్ద విద్యుత్ షాక్తో బండి రేణుక (35) అనే మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఉపాధి కోసం రుణం తీసుకుని పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్న రేణుక, శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో కిందపడిపోయిన ఆమెకు తలకు తీవ్ర గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
మృతురాలి భర్త యోగేష్ గ్రామంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రేణుక మృతి పట్ల గ్రామస్తులు సంతాపం తెలిపారు.








