కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కమ్మరి సంజు (35) అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ చెరువులో మునిగి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం, సంజు తన కుమారుడితో కలిసి ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం న్యాల్కల్ గ్రామానికి వెళ్లారు. అక్కడ చెరువులో ఈత కొట్టడానికి దిగిన సంజు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని గాలించగా, మృతుడి చెప్పులు, చొక్కా లభ్యమయ్యాయి.
మరుసటి రోజు ఉదయం సుమారు 6 గంటలకు సంజు మృతదేహం చెరువులో పైకి తేలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు కమ్మరి సంజు ప్రస్తుతం నిజామాబాద్ ఆనంద్ నగర్లో తన కుటుంబంతో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ప్రతిరోజూ న్యాల్కల్ గ్రామానికి వెళ్లి కల్లు సేవించే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు.
ఈ విషాదకర సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం.












