మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళుతున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి సహాయక చర్యల గురించి వివరించారు.
ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అందిన సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోంది.











