రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతవ్వడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితుల కుటుంబాలకు మంత్రి సవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
ప్రమాదానికి సంబంధించిన మృతులు, క్షతగాత్రుల వివరాలను వెంటనే సేకరించి, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని మార్కాపురం ఎస్పీ, జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.
ప్రయాణాల్లో ఎల్లప్పుడూ నిబంధనలు పాటించాలని, బస్సు డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా చూడాలని మంత్రి సవిత సూచించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.











