సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. “అరైవ్ – అలైవ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ సూచనలు చేశారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో “అరైవ్ – అలైవ్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచి, వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
హైవేలపై అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని కలెక్టర్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు ప్రయాణికులు సీట్‌బెల్ట్ వాడాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, లైసెన్స్ ఉన్నవారే నడపాలని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఏటా 400 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ముఖ్యంగా టూ వీలర్ ప్రమాదాలు, మైనర్ల డ్రైవింగ్ ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు.
అడిషనల్ కలెక్టర్ పాండు, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలను కుటుంబాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హెల్మెట్లు పంపిణీ చేశారు.












