నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. గత రెండు వారాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో మొత్తం 338 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో 34 మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి ₹25.75 లక్షల జరిమానా విధించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 30 నుండి ఏప్రిల్ 11 వరకు జరిగిన వాహన తనిఖీలలో 338 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 34 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారు.
మిగిలిన 304 మందికి కలిపి ₹25,75,000 జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ తనిఖీలు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ఎక్కువగా గుర్తించబడుతోందని ఆయన తెలిపారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ అవుతుందని, మద్యం మత్తులో ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదని హెచ్చరించారు. మైనర్లు వాహనం నడిపితే వారితో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు అవుతుందని, పదేపదే తప్పిదం చేస్తే జైలు శిక్ష తప్పదని తెలిపారు.
మోటార్ వాహనాల చట్టం (సవరణ-2019) ప్రకారం, మొదటిసారి పట్టుబడితే ₹10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే ₹15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.








