మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డుకోవడం ద్వారా మహిళలకు తీవ్ర అన్యాయం చేశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ బిల్లును వ్యతిరేకించిన వారిని చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
హుజురాబాద్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇండియా కూటమి తీరును నిరసిస్తూ శనివారం నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మేలు చేసే ఏ చట్టాన్నైనా వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీ నైజమని, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోయిందని విమర్శించారు.
దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడూ సహకరించలేదని, ఆ పార్టీ మొదటి నుంచి మహిళా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని కృష్ణారెడ్డి ఆరోపించారు. విపక్షాల అసలు స్వరూపం బయటపడిందని, మహిళలకు ద్రోహం చేసేది ఎవరో స్పష్టమైందన్నారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యులను చేయాలన్న సంకల్పానికి విపక్షాలు మరోసారి అడ్డుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, ఇండియా కూటమి పార్లమెంటు సాక్షిగా మహిళా హక్కులను కాలరాయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని కృష్ణారెడ్డి అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లును వ్యతిరేకించారని, చారిత్రక బిల్లును అడ్డుకొని చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన విమర్శించారు. డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ను దేశం, ముఖ్యంగా మహిళలు ఎప్పటికీ క్షమించరని, వారి విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మహిళల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలతో మహిళలను తీవ్రంగా మోసం చేసిందని కృష్ణారెడ్డి ఆరోపించారు. తులం బంగారం, నెలసరి రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్కు, ముఖ్యమంత్రికి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











