తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గైని శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలోని కోర్టు రోడ్డు సమీపంలో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలను, అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు వేముల బలరాం, జిల్లా మహిళా అధ్యక్షురాలు బి. వసంత, జిల్లా మైనార్టీ నాయకురాలు షేక్ జైనాబ్, జిల్లా క్రైస్తవ అధ్యక్షులు దానియల్, జిల్లా యూత్ టీఆర్ఎస్ నాయకులు జొన్నల వినోద్, రాము వంటి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గనిర్దేశం చేశారని, ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.












