కామారెడ్డి, జూలై 11, 2026
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి, భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ వి.విక్టర్, ఆర్ డి ఓ. N Y గిరి, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ఇంకా కొన్ని సమస్యలున్నాయని, ధరణి కాలంలో పెండింగ్లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, లీగల్ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లిస్తామని, జూలై 28లోపు విధుల్లో చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.












