రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, రైతు ఉత్సవాల పేరుతో ప్రచారం మానుకొని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
రైతు సమస్యలు పరిష్కారం కాకుండా నిర్వహించే రైతు ఉత్సవాలు నిరుత్సాహ మేళాలుగా మిగిలిపోతాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మెట్ట గ్రామంలో రైతు మేళా సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.
రైతులకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా వంటి కీలక పథకాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. నర్మెట్ట గ్రామంలోనే సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ ఇంకా చెల్లించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం వేల కోట్లలో ఉందని పేర్కొన్నారు.
రుణమాఫీకి రూ.51 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తే, బడ్జెట్లో రూ.31 వేల కోట్లకు తగ్గించి, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే చెల్లించారని హరీష్ రావు విమర్శించారు. రైతు భరోసా నిధులు కూడా మూడు సీజన్లుగా బకాయి ఉన్నాయని, సిద్దిపేటలోనే రూ.170 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. వెంటనే రైతులకు చెల్లించాల్సిన నిధులను జమ చేయాలని, ఉగాది లోపు రైతుల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.










