కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం పరిధిలోని భూంపల్లి, లింగంపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుతం ఈ మార్గంలో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గాంధారి-లింగంపల్లి-భూంపల్లి మీదుగా కామారెడ్డి వరకు ఆర్టీసీ బస్సు నడపాలని వారు వినతిలో పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి-బాన్సువాడ మధ్యలో ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కువగా నడుపుతూ, ఆర్డినరీ బస్సులను తగ్గించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు డిపో మేనేజర్ దృష్టికి తెచ్చారు. గతంలో ఈ రూట్ లో 10 ఆర్డినరీ బస్సులు నడిచేవని, ప్రస్తుతం కేవలం నాలుగు మాత్రమే నడుపుతున్నారని, మిగిలినవి ఎక్స్ ప్రెస్ బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
భూంపల్లి, లింగంపల్లి, జనగాం గ్రామాల ప్రజలు బాన్సువాడ, కామారెడ్డికి ప్రయాణించడానికి వీలుగా ఆర్డినరీ బస్సులను నడపాలని వారు డిమాండ్ చేశారు. ఆర్డినరీ బస్సులు అందుబాటులోకి వస్తే తమ ప్రయాణ అవసరాలు తీరుతాయని తెలిపారు. స్పందించిన డిపో మేనేజర్ దినేష్, కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయా రూట్లలో ఆర్డినరీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.











