నాగారం డివిజన్ ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో ‘ద్రోణ క్రికెట్ అకాడమీ’ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈస్ట్ గాంధీనగర్ కాలనీ జనరల్ సెక్రటరీ సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అకాడమీని ప్రారంభించారు.
ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందిస్తాయని, స్థానికంగా ఇలాంటి అకాడమీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పిస్తాయని తెలిపారు.
మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే క్రీడల్లో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాగారం ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, ఈస్ట్ గాంధీనగర్ కాలనీ ప్రెసిడెంట్ సత్యం సాగర్, అకాడమీ నిర్వాహకులు సాయి ప్రసాద్ రెడ్డి, కాలనీవాసులు, అకాడమీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతకు మెరుగైన క్రీడా శిక్షణ అందించడమే అకాడమీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.











