కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ నాయకులు, క్రెడా సంఘం ప్రతినిధులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కామారెడ్డి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, క్రెడా అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్, క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని టిపిసిసి నాయకులు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.











