నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుమారు వెయ్యి మంది అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత, కొత్త పార్టీ ఏర్పాటు, ప్రస్తుత రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు బుధవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత, రంజిత్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సుమారు వెయ్యి మంది అనుచరులు కూడా జాగృతిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ భవిష్యత్, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25వ తేదీ నిలుస్తుందని, ఆరోజు తాము ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని కవిత తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోని అధికార, ప్రతిపక్ష పార్టీల తీరును ఆమె విమర్శించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేది 'జాగృతి' అని ప్రజలు విశ్వసిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
తెలంగాణ వస్తే స్వయం పాలన వస్తుందనుకుంటే, కొందరు నాయకులు ఢిల్లీకి ఘోరమైన గులాంగిరీ చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే నిలబడి మాట్లాడటం, భట్టి విక్రమార్క తన సీటుకే ఎసరు వస్తుందని భయపడటం వంటివి చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కేరళ ఎన్నికలు, డబ్బు కావాలంటే 'ఎస్' అని, ప్రజల సమస్యల గురించి అడిగితే 'నో' అని చెప్పడం గులాంగిరీకి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, హైడ్రా పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే, దానివల్ల తుంగభద్రకు నీళ్లు రాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నష్టపోతుందని కవిత తెలిపారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి ఎందుకు మోడీని ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. మోడీ ఏంచేసినా రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని, కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ మేనేజ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. గద్వాల్ జిల్లాలో గడీల కుటుంబాల కారణంగా ప్రజలు నష్టపోయారని, గద్వాల్ గడీలో ఉద్యమకారుల జెండా ఎగరాలని కవిత ఆకాంక్షించారు. అక్కడి చేనేత, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.











