ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతోందని, పేదల పక్షాన నిలుస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అన్నారు.
బుధవారం ఆయన అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
మైసమ్మ చెరువును పరిశీలించిన రమేష్, చెరువు పూడ్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కబ్జాకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని, పూడ్చిన మట్టిని తొలగిస్తామని హెచ్చరించారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అనేక చెరువులు కనుమరుగయ్యాయని, వాటి పునరుద్ధరణకు అధికారులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. చెరువులో గుర్రపు డెక్క తొలగించి దోమల బెడద తగ్గిస్తామని, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను కూడా త్వరలో సరిచేస్తామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని, నిధుల కొరత ఉండదని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.











