తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం, అక్కడి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం కేరళ, పాండిచ్చెరి, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలంగాణలో కేబినెట్ విస్తరణపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రివర్గంలో కొన్ని ఖాళీలున్నాయి. ఎన్నికల తర్వాత జరిగే విస్తరణతో పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరనుంది. ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విస్తరణకు సంబంధించిన కార్యాచరణ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటనతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.









