నిజామాబాద్, జూలై 11
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు జయరాజ్ మాట్లాడుతూ.. అరుణోదయ నాగన్న పాటలు విప్లవోద్యమ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరకాల నాగన్న సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.
విప్లవోద్యమ చరిత్రలో అరుణోదయ నాగన్న గొంతు చిరస్మరణీయమని ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు జయరాజ్ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ పరకాల నాగన్న సంస్మరణ సభను శనివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని నీలం రామచంద్రయ్య భవన్లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ.. సూర్యుడు ఉదయించకముందే ప్రజలను మేల్కొల్పేది నాగన్న పాటేనని, రాత్రివేళ జోలపాటగా మారి పల్లెల్లో చైతన్య జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాగన్న, అమరవీరుల త్యాగస్ఫూర్తిని తన గానంతో ప్రజల్లో నింపారని కొనియాడారు. తన పాటలతో ప్రభుత్వాలను ప్రశ్నించిన ఆయన, నిర్బంధాలు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్నప్పటికీ ప్రజా ఉద్యమాల నుంచి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని అన్నారు.
మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలే నాగన్నను ప్రజా ఉద్యమాల్లో అగ్రగామిగా నిలబెట్టాయని జయరాజ్ పేర్కొన్నారు. మట్టిమనిషిగా, ప్రజల మనిషిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఒగ్గుకథ, బుర్రకథ వంటి జానపద కళారూపాలతో ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల విస్తరణకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. నాగన్న స్ఫూర్తితో ప్రజా సంస్కృతిని పరిరక్షిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సభకు అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎస్.కే. అబ్దుల్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రచయిత బి. నాగభూషణం, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు ఆకుల పాపయ్య, జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య, పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిట్ల సరిత, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ప లింగం, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్, సూర్య శివాజీ, భూమన్న, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్, సూరిబాబు, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












