పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని 'INDI' కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ మచిలీపట్నంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు శనివారం భారీ ఎత్తున నిరసన చేపట్టాయి. ఈ నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహిళా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు సాధికారత కల్పించే చారిత్రాత్మక బిల్లును అడ్డుకోవాలని చూడటం 'INDI' కూటమి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని నాయకులు విమర్శించారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్లను అమలులోకి తెస్తుంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుతగలడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మహిళా లోకం ఈ పార్టీలకు తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని ప్రజలు క్షమించరని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు యిర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నారాయణ స్వామి, రాష్ట్ర సీనియర్ నాయకులు పంతం గజేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రాము, జిల్లా ఉప అధ్యక్షులు గోపిశెట్టి దుర్గా ప్రసాద్, జిల్లా కార్యదర్శి నాగలింగం అయోధ్య రామయ్యా, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు ప్రఖ్యాత్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి ఈశ్వర్, జిల్లా యువ మోర్చా ట్రెజరర్ బండ్రెడ్డి నాగరాజు, జిల్లా యువ మోర్చా అధికార ప్రతినిధి ఆర్జా శివ, బీజేపీ జిల్లా కార్యదర్శి సతీష్, ఆఫీస్ ఇంచార్జ్ రమణతో పాటు జిల్లా మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోనేరు సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.











