రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో, ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని 15 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్తో మాట్లాడుతూ, రెండవ పట్టణ పరిధిలోని ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారం దిశగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం నగర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలే నగర ప్రగతికి పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, దీని వల్ల బీజేపీ మరింత బలపడుతుందని ఆయన చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయని, అదే ఉత్సాహంతో ఖమ్మంలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తారని, ఖమ్మం రెండవ పట్టణంలో అన్ని డివిజన్లలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

