తమ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన అన్నారు.
కేరళ దేశంలో అత్యంత తక్కువ అవినీతి, అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తుందని, అక్షరాస్యతలో కూడా ముందుందని విజయన్ తెలిపారు. తమ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, వీటి గురించి నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
తమ ప్రభుత్వం అవినీతిమయమైందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తిరస్కరించిన విజయన్, తెలంగాణలో జీతాలు, పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని, అలాంటిది మా దగ్గర పాలన, సంక్షేమం గురించి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యల ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ వైరం మరింత తీవ్రతరమైంది. రేవంత్ రెడ్డి విమర్శలకు విజయన్ ఇచ్చిన ఘాటు ప్రతిస్పందన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.










