తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ మారదని, యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని మంగళవారం అన్నారు. ఓటమికి ప్రజలనే బాధ్యులను చేయడం సరికాదని ఆమె విమర్శించారు.
హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్ పార్టీ విధానాలపై తీవ్రంగా స్పందించారు. 'వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదు' అని ఆమె తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మార్గంలోనే వెళ్తోందని ఆరోపించారు. ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా, ప్రజలనే తప్పు చేశారని అనడం సరికాదని, ఇది ప్రజలను చులకన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
75 ఏళ్ల వృద్ధుడిని యువనాయకుడిగా చెప్పుకోవడం తెలంగాణ యువత పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తోందని కవిత అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి, తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం బీఆర్ఎస్ పార్టీ మారదనేదానికి నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.
జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని కవిత గుర్తు చేశారు. జగిత్యాల సభలో తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్, లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణన వంటి కీలక అంశాలపై స్పందించకపోవడం మహిళలకు గౌరవం లేకపోవడాన్ని సూచిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా బలప్రదర్శనకు దిగుతున్నాయని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే, కాంగ్రెస్ పిట్టకథలు చెబుతోందని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు తాము ఈనెల 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని, సమస్యలను పరిష్కరించే వరకు పోరాడతామని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.











