కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణారాహిత్యంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు గాను ముగ్గురు నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది.
మాజీ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పుండ్ర సాయి కుమార్, మాజీ NSUI జిల్లా నాయకుడు నరేన్ దీప్లపై ఈ వేటు పడింది. వీరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష సందర్భంగా చోటుచేసుకుంది. రైతుల మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.
వరదబట్టు వేణు రాజ్, పుండ్ర సాయికుమార్, నరేన్ దీప్ తమ వ్యక్తిగత కార్యక్రమాల అమలు కోసం, నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు అంతరాయం కలిగించారని, నాయకులతో వాగ్వాదానికి దిగారని ఆరోపణలున్నాయి. పలుమార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా భావించి వెంటనే ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లా, రాష్ట్ర నాయకుల సమక్షంలోనే ఈ సంఘటన జరగడంతో, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేరుగా సస్పెన్షన్ విధించినట్లు సమాచారం. ఈ ముగ్గురికి ఇకపై కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదని పార్టీ స్పష్టం చేసింది.












