టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే వ్యక్తిగత అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి వివిధ స్థాయిల్లో పదవులు పొందిన 11 మంది నాయకులతో పాటు, వివిధ పదవుల్లో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలతో బండి రమేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని విడవకుండా, కష్టపడి పోరాటం చేసిన వారిని పార్టీ తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.
జిల్లా పార్టీ పదవుల నియామకంలో నియోజకవర్గంలో కులాలు, మతాలు, సీనియారిటీ, సిన్సియారిటీ, హానెస్టీ వంటి గుణగణాలను పరిగణలోకి తీసుకున్నట్లు రమేష్ పేర్కొన్నారు. పదవులు పొందినవారు భవిష్యత్తులో పార్టీ కోసం సైనికుల మాదిరి కష్టపడి పని చేయాలని సూచించారు.
రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్ని డివిజన్లను పార్టీ గెలిచి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్చార్జిగా అందరినీ సమన్వయం చేస్తూ, పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.










