విజయనగరం జిల్లాలో జాతీయ రహదారులపై వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు.
జాతీయ రహదారిపై, ముఖ్యంగా ప్రధాన రహదారిపై, వంతెనల సమీపంలో, మలుపులు, జంక్షన్ల వద్ద వాహనాలను నిలపడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు డ్రైవర్లు పాటించాల్సిన నిబంధనలపై ఆయన పలు సూచనలు చేశారు.
ప్రధాన రహదారిపై వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలపరాదని, అత్యవసరమైతే అనుమతించబడిన పార్కింగ్ స్థలాల్లోనే ఆపాలని సూచించారు. మలుపులు, వంతెనలు, జంక్షన్ల వద్ద వాహనాలు నిలపడం నిషేధమని, అత్యవసర పరిస్థితుల్లో హజార్డ్ లైట్లు ఆన్ చేసి, రేడియం స్టిక్కర్లు అతికించాలని సూచనలు ఇచ్చారు.
రోడ్డు సేఫ్టీ మొబైల్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
అన్ని ట్రాన్స్పోర్ట్ సంస్థలు, డ్రైవర్ సంఘాలు తమ సభ్యులకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు.











