తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ ఏర్పాట్లపై ఆయన అధ్యక్షతన ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్, అదనపు ఎస్పీ, వివిధ డీఎస్పీలు, ఆర్డీఓ, ఈఓ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, క్యూ లైన్ నిర్వహణ, దర్శన వ్యవస్థ, రద్దీ నియంత్రణపై ఎస్పీ సమీక్షించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణకు ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. విఐపీ, సాధారణ భక్తుల కోసం వేర్వేరు మార్గాలను స్పష్టంగా గుర్తించాలని తెలిపారు. ఎలక్ట్రికల్, ఫైర్ విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సమీక్ష అనంతరం జిల్లా ఎస్పీ దేవాలయాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బారికేడ్లు, క్యూ లైన్లు, రద్దీ నియంత్రణ, పార్కింగ్ వంటి సదుపాయాలపై అధికారులకు సూచనలు చేశారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.











