తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు RBI నుంచి చేబదుళ్లు తీసుకోవాల్సి వస్తోందని, ఇది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని ఆమె ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలోని అంశాలను ఆమె ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, రోజువారీ ఖర్చులకు కూడా RBI వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి తెచ్చిందని కవిత విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు RBI నుంచి చేబదులు ద్వారా డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించారని, ఇది సిగ్గుచేటని ఆమె అన్నారు. ఏడాది కాలంలో రూ.1.30 లక్షల కోట్లు చేబదులు అప్పులు తెచ్చి సర్కారును నడిపించటమంటే అది చేతకానితనమేనని ఆమె పేర్కొన్నారు.
CAG నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరం ముగిసినా మరో రూ.6 వేల కోట్ల చేబదులు చెల్లించలేదని కవిత ఎత్తి చూపారు. నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న తెలంగాణలో, రోజువారీ కనీస అవసరాల కోసం రూ.1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటెన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు సంపద పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చాక కేవలం అప్పులతోనే కాలం గడుపుతున్నారని కవిత విమర్శించారు. ఇప్పటికే రూ. 8.65 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై దాదాపు రూ. 9 లక్షల అప్పు భారాన్ని మోపారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా "మిగులు బడ్జెట్" అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. CAG నివేదికతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసం బట్టబయలైందని, ప్రచార ఆర్భాటాలు ఆపి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, అకాల వర్షాల కారణంగా జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయని, వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, మామిడి కాయలు నేలరాలాయని, నువ్వులు, పసుపు, వరి పంటలకు తీరని నష్టం జరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.











