గాయని మంగ్లీ తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రసారం చేయబడిన వీడియోలను తొలగించాలని ఆమె కోరారు.
తనకు సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరును అనవసరంగా లాగుతూ, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన పిటిషన్లో పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ముందుస్తు ప్రణాళికతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
ఈ అసత్య ప్రచారం తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించిందని, సోషల్ మీడియాలో ఈ వార్తలకు సంబంధించిన లింకులను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రచారం జరగకుండా నిరోధించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
ఈ విషయంలో రామావత్ మధు, న్యాయవాది సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డిలతో పాటు పలు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియా సంస్థలకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించి, తమ వాదనలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది.











