జిల్లాలో రబి-యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో, 2025-26 రబీ సీజన్లో జిల్లాలో సుమారు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఇందులో దొడ్డురకం ధాన్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాలను అదనపు కలెక్టర్ తెలియజేశారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 నిర్ణయించినట్లు తెలిపారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389తో పాటు అదనంగా రూ.500 బోనస్‌తో కలిపి రూ.2,889 అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం మొత్తం 226 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఐకేపీ ఆధ్వర్యంలో 97, ప్యాక్స్ ఆధ్వర్యంలో 97, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 31, ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఒక కేంద్రం ఉండనున్నాయి. ప్రతి కేంద్రంలో తార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు, తేమ కొలిచే మీటర్లు వంటి మౌలిక సదుపాయాలు సరిపడా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రతిపాదించిన రైస్ మిల్లర్లకు మాత్రమే తరలించాలని, వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.












