బాసర, జూలై 31
ఆషాఢ మాసంలో గ్రామదేవతలను కొలిచే సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే ఇందూరు ఊరపండగ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 2న సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలో భాగంగా ఆయన ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు.
ఆషాఢ మాసంలో గ్రామదేవతలను కొలిచే సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే ఇందూరు ఊరపండగ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 2న సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఊరపండగ సందర్భంగా శుక్రవారం ఖిల్లాలోని అమ్మవార్ల గద్దె నుంచి గాజులపేట, పెద్దబజార్ మీదుగా దుబ్బ వరకు కొనసాగే ఊరేగింపు మార్గాన్ని ఆయన పరిశీలించారు. మామిడి చెట్టుతో సంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్న దేవతా ప్రతిరూపాలను కూడా ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందూరులో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిర్వహించే అతిపెద్ద సాంప్రదాయ వేడుక ఊరపండగ అని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలను ప్రార్థిస్తూ ఈ వేడుకను నిర్వహించడం ఇందూరుకు ప్రత్యేకత అని అన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెను విస్తరించి, ఎత్తును పెంచినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.
గాజులపేటలోని "సరి" ప్రాంతంలో తోపులాటలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. తెలంగాణలో బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకత మాదిరిగానే, ఇందూరులో ఊరపండగకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాజేశ్వర్తో పాటు బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, పసునూరి రాము, బెల్లాల్ శశాంక్, వైష్ణవి సుధా, కల్పే అర్చనా చిరంజీవి, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్, ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.












