ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే ఈ వేడుకకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
సోమవారం ఒంటిమిట్టలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం లతో కలిసి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాల సమర్పణ చేస్తారని తెలిపారు. కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, భక్తులకు గ్యాలరీలలో ప్రసాదాలు, త్రాగునీరు అందజేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేస్తామని, భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 'మే ఐ హెల్ప్ యు' బృందాలు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపారు.
భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, భద్రత, పార్కింగ్, అన్న ప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, హెల్ప్ డెస్కులు, సూచిక బోర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. టీటీడీ తరఫున చేసిన ఏర్పాట్లను జేఈఓ వీరబ్రహ్మం వివరించారు.











