‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా, రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు నిర్మల్ పట్టణంలో భారీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
బుధవారం ఉదయం జయశంకర్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాయి. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలపై క్విజ్, వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులే రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లని, పిల్లలు చెప్పే మంచి విషయాలను అందరూ గౌరవంగా స్వీకరిస్తారని అన్నారు.
కుటుంబ సభ్యులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు, అతివేగం ప్రమాదాలు వంటి విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో కలెక్టర్, అధికారులు, విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.












