మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాలను కోటపల్లి పోలీసులు రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదు చేసి, లారీతో పాటు 30.7 టన్నుల విత్తనాలను సీజ్ చేశారు.
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించి మోసం చేసేందుకు యత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సరైన అనుమతులు, బిల్లులు లేకుండా మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుండి తెలంగాణలోని మనకొండూర్ వైపు లారీలో తరలిస్తున్న సుమారు 30,700 కిలోల (30.7 టన్నులు) వరి విత్తనాలను తనిఖీల్లో గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.21,49,000 ఉంటుందని జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఏ. వెంకటేశ్వర్లు వెల్లడించారు.
కోటపల్లి మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సాయి కృష్ణ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కోటపల్లి ఎస్సై ఆధ్వర్యంలో రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో TS-29 TB-6555 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో భారీగా వరి విత్తనాల బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విత్తనాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, అధికారిక లేబుల్స్, ధృవీకరణ పత్రాలు, బిల్లులు లేవని నిర్ధారించారు.
విత్తనాల ప్యాకింగ్ కూడా చట్టబద్ధంగా లేకపోవడంతో, సీడ్స్ యాక్ట్-1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్-1983 నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు నిర్ధారించి విత్తనాలను, లారీని సీజ్ చేశారు. విత్తనాల నాణ్యతను పరిశీలించేందుకు నమూనాలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ అనుమతి పొందిన డీఎన్ఏ ఎఫ్పీ & టీసీఎం ల్యాబ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు.
ఈ అక్రమ రవాణా ఉదంతంలో నిబంధనలు ఉల్లంఘించిన లారీ డ్రైవర్ కట్ల భద్రయ్య, సీడ్ ఆర్గనైజర్ నిమ్మటి సతీష్, మేనేజింగ్ డైరెక్టర్ జీఎన్వీ రామకృష్ణ (సోనం సీడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), లారీ యజమాని పోలవేని రాజేష్‌లపై కోటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద, ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని ఆయన సూచించారు.











