ప్రభుత్వ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 38 మంది బాధితులకు రూ. 23.55 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.
ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ, కొందరు తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధికి అడ్డుపడే వారిని కూడా సహించేది లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పట్టించుకోలేదని, దానివల్లనే గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రస్తుత వేసవిలో సమస్యలు దృష్టికి రాగానే పరిష్కరించి తాగునీటిని అందిస్తున్నామని, బీటీపీ కాలువ నిర్మాణం పూర్తి చేసి కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్డీఏ కూటమి సహకారంతో కేంద్రం ఆర్డీటీ FCRA రెన్యూవల్ చేసిందని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
పేద ప్రజలకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి నెలా బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప మనసుతో పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా నేరుగా ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించేలా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.











