రాష్ట్ర మంత్రి సీతక్క, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుకు లీగల్ నోటీసు పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
సీతక్క తరపు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్, రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్కు ఈ లీగల్ నోటీసును పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లు ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమని, ఆధారాలు లేనివని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమని ఆమె అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె తన నోటీసులో పేర్కొన్నారు.











